రైతుల పరిస్థితి చాలా దయనీయం డాక్టర్ తులసి రెడ్డి
వేంపల్లె మేజర్ న్యూస్:
రాష్ట్రంలోని రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి అన్నారు. గురువారం ఇటివల అకాల వడగండ్ల వాన, పెనుగాలులకు నెలమట్టమైన అరటి పంటలను తులసిరెడ్డి పరిశీలించారు. మండలంలోని తాళ్లపల్లి, నందిపల్లి, కుప్పాలపల్లి, వెలమవారిపల్లి, బక్కనగారిపల్లి గ్రామాల్లో అరటి రైతులతో తులసిరెడ్డి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, కూలీలు, ఎరువులు, క్రీమిసంహారక ధరలు పెరగడంతో పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిందన్నారు. రైతులు అరటికి దాదాపు ఎకరాకు రూ. 1.50 లక్ష ఖర్చు పెట్టారన్నారు. అకాల వడగండ్ల వాన, పెనుగాలులకు పంట పూర్తిగా నెలమట్టమై భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు కనీసం రూ.50 వేలు నష్టపరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని, అప్పు తెచ్చే మార్గం కానరాక ఆత్మాభిమానంతో కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్నారు. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాయని, సహకార బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు రూ.75 వేలు వరకు తమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాజధాని అమరావతి కోసం రెండో విడత భూసమీకరణలో ఏడు గ్రామాల రైతులకు ఒక్కో కుటుంబానికి రూ. 1.50 లక్ష రుణ మాఫీ చేసిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం రామకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, ధ్రువకుమార్ రెడ్డి, రామకృష్ణ, అమర్, ఉత్తన్న, రవీంద్రారెడ్డి, రమణ, నాగరాజు, బద్రీ, రాఘవయ్య, శేఖర్, రైతులు పాల్గొన్నారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.