రాయలసీమ, కోస్తాంధ్రలో నేటి నుంచి భారీ వర్షాలు
అమరావతి, సూర్య ప్రతినిధి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి వర్షాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల కొన్ని రోజుల పాటు, ముఖ్యంగా ఈ నెల 19 వరకు రాయలసీమ మరియు కోస్తాంధ్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండగా, రాగల గంటల్లో అక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.