ప్రతి గడపకూ ఆత్మీయ పలకరింపు.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ జనసేన పార్టీ, కూటమి బలపరిచిన 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి విజయలక్ష్మి గునుకుల డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపనూ ఆత్మీయంగా పలకరిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రచారంలో కూటమి ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న అభివృద్ధికి ప్రజల మద్దతు కోరుతూ, 21వ డివిజన్‌లో కార్పొరేటర్ అభ్యర్థిగా విజయలక్ష్మి గునుకుల కి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొంటూ, మేయర్ అభ్యర్థి శ్రీ రూప్‌కుమార్ యాదవ్ కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి గడపతో ఉన్న పరిచయాన్ని ఆత్మీయతగా మలుచుకుంటూ, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని విజయలక్ష్మి గునుకుల తెలిపారు. డివిజన్‌లోని చిన్నచిన్న సమస్యలను సైతం నిర్లక్ష్యం చేయకుండా, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వివరించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించేందుకు “Know Your App – Know Your Leader” పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనను వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్యలపై స్పందించడం, బాధ్యతాయుతమైన సేవ అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, జనసేన–తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయలక్ష్మి గునుకుల గారికి సంఘీభావం తెలిపారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ప్రజలను కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు.