ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ వనరుల మధ్య సమన్వయం సాధిస్తూ, అందుబాటులో ఉన్న నిధులను ప్రాధాన్యతల ప్రకారం వినియోగించుకుని మండలాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి 35 మండలాల జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, పాశం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి సమక్షంలో నిర్వహించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఇందుకూరుపేట జడ్పీటీసీ సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును దుత్తలూరు జడ్పీటీసీ కంభం విజయరామిరెడ్డి ప్రతిపాదించగా, కావలి రూరల్ జడ్పీటీసీ సింధుజ బలపరిచారు. దీంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి మనుబోలు జడ్పీటీసీ పొట్టేళ్ల ప్రసాద్ పేరును జలదంకి జడ్పీటీసీ వేల్పుల వేణుగోపాల్ ప్రతిపాదించగా, వరికుంటపాడు జడ్పీటీసీ మూలే హరిత బలపరిచారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దీంతో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్‌గా పొట్టేళ్ల ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎన్నికల పరిశీలకురాలు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలి – కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాజీవితంలోకి ప్రవేశించడం ఎంతో ముఖ్యమైన సందర్భమని, అదే సమయంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత వారి వ్యక్తిగత జీవితం, ప్రవర్తన, మాటతీరు, భాష వంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తించి హుందాతనంతో వ్యవహరించాలని, ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఒకసారి మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని, ఏ విషయం మాట్లాడే ముందైనా ఆలోచించాలని హితవు పలికారు.
ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా తమకు ప్రాతినిధ్యం వహించే బాధ్యతను అప్పగించారని, అందువల్ల జడ్పీటీసీ సభ్యులపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, అర్హులైన వారికి పింఛన్లు వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆశిస్తారని తెలిపారు. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ వనరులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవని, పరిమిత వనరులను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటూ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం ప్రజాప్రతినిధుల రాజకీయ పరిణతికి నిదర్శనమని పేర్కొన్నారు.
జడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ పరిధిలోని పనులకే పరిమితం కాకుండా సంబంధిత ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు, సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. జిల్లా పరిషత్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మండలాల్లో సమర్థవంతంగా అమలు చేసేలా కృషి చేయాలన్నారు. ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను మండలాలకు తీసుకురావాలని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అనేక పరిశ్రమలు, కంపెనీలు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను స్థానిక అభివృద్ధికి వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సీనియర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిస్తూ అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
జిల్లా పరిషత్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉందని, గతంలో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనేకమంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నత పదవులను అధిరోహించారని కలెక్టర్ గుర్తుచేశారు. జిల్లా పరిషత్ పదవి ఉన్నత రాజకీయ ప్రస్థానానికి మంచి పునాది వంటిదని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశాల గౌరవం, మర్యాదను కాపాడుతూ, సమావేశాల్లో అసహనం లేదా ఆవేశం కలిగినప్పటికీ హుందాగా వ్యవహరించాలని సూచించారు. సమావేశాలకు హాజరయ్యే జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమక్షంలో ప్రజా సమస్యలను నిర్మాణాత్మకంగా చర్చించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులందరినీ కలుపుకుని నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా – జడ్పీ చైర్మన్ పోలంరెడ్డి
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారం, సమన్వయంతో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. జడ్పీటీసీ సభ్యులందరికీ జిల్లా పరిషత్‌లో సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని, అందరి మనోభావాలను గౌరవిస్తూ అన్ని మండలాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
పదవిని బాధ్యతగా స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తా – జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్
వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ మాట్లాడుతూ తనకు అప్పగించిన పదవిని ఒక బాధ్యతగా గుర్తించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తాను కష్టపడితే ఫలితం లభిస్తుందనేందుకు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సీఈఓ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య ప్రశాంతంగా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.