ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు ప్రభుత్వం ప్రాధాన్యం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా.. మొత్తం 28 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 12, ఇంజనీరింగ్ కి సంబంధించి 4, వార్డు సచివాలయాలకు సంబంధించి 2, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 3, హౌసింగ్ కి సంబంధించి 3, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 1, మెప్మాకు సంబంధించి ఒకటి ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కనుక అర్జీలకు ప్రణాళికబద్ధంగా సంబంధిత అధికారులు పరిష్కారం చూపాలన్నారు. క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి పారదర్శకంగా విచారణ జరిపి అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని సూచించారు. సమర్పించిన అర్జీ పరిష్కారం కాలేదనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని.. ప్రజల నుండి స్వీకరించే ప్రతీ అర్జీకి సరైన ఎండార్స్ మెంట్ ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజ వల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ ఎండి అబ్దుల్ మలిక్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.