ప్రైవేటు పాఠశాలల హెచ్ఎం లతో ఎంఈఓ లు సమీక్ష.
నరసన్నపేట నవంబర్ 17 మేజర్ న్యూస్: నరసన్నపేట మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మండల విద్యాశాఖ అధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు సంబంధించిన వివిధ ఆన్‌లైన్ అప్‌డేషన్లు, విద్యా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.
యుడైస్ ప్రొఫైల్‌లో పెండింగ్‌లో ఉన్న డేటా అప్‌డేషన్, స్కూల్ ప్రొఫైల్ అప్‌డేషన్, టీచర్ మాడ్యూల్ అప్‌డేషన్ ప్రక్రియలను సత్వరమే పూర్తి చేయాలని అధికారులు సూచించారు. సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు స్పష్టం చేశారు.
అలాగే పాఠశాలల్లో నిర్వహించనున్న SA-1 పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పాఠశాలల సమయపాలనను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మండల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.