పోషకాహారంతోనే చిన్నారుల సంపూర్ణ వికాసం
రామచంద్రపురం, పూడివలసలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం
బాడంగి, సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్): పోషణ మాసోత్సవంలో భాగంగా బాడంగి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రామచంద్రపురం, పూడివలస గ్రామాల్లో బుధవారం అంగన్వాడీ ఉత్సవాలను నిర్వహించారు. రామచంద్రపురం, పూడివలస అంగన్వాడీ కేంద్రాల్లో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎల్. సుజాత పాల్గొని చిన్నారులు, తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీడీపీఓ ఎల్. సుజాత మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి పోషకాహారం ఎంతో కీలకమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ప్రతిరోజూ సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమాల్లో రామచంద్రపురం సెక్టార్ సూపర్‌వైజర్ వై.వి. నాగమణి, రేజేరు సెక్టార్ సూపర్‌వైజర్ ఏ. శ్రీదేవి, బీపీసీ కమలకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.