పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కీలకం: హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి:రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతల పరిరక్షణే అత్యంత కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌ను అత్యంత పటిష్టంగా అమలు చేస్తున్నామని, దీని ఫలితంగా రాష్ట్రంలో నేరాల రేటు 14 శాతం తగ్గిందని ఆమె వెల్లడించారు. గతంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని హోంమంత్రి గుర్తుచేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైఎస్సార్‌సీపీ కుట్రలు చేస్తోందని అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఒక ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన సాధారణ ఘటనగా చూడకూడదని, ఆ ఘటనను సమాజంపై, వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించాలని ఆమె స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా సురక్షిత వాతావరణాన్ని కొనసాగిస్తామని హోంమంత్రి పునరుద్ఘాటించారు.