పెనమలూరులో బోడే వెంకట్రామ్ మార్క్
పెనమలూరులో బోడే వెంకట్రామ్ మార్క్
వినడం కాదు.. బాధ్యతగా ముందడుగు
ప్రజా సమస్యలపై స్పందన.. యువతకు ఉపాధి అవకాశాలు..
పేదలకు చేయూత.. క్రీడలకు ప్రోత్సాహం..
తండ్రి బోడే ప్రసాద్‌కు అండగా ఉంటూనే తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతున్న యువనేత
పెనమలూరు, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ ప్రతినిధి/ప్రేమ్ రాజ్ :
పెనమలూరు నియోజకవర్గంలో యువనాయకత్వం తనదైన ముద్ర వేస్తోంది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత బోడే వెంకట్రామ్ ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. ప్రజల సమస్యలను విని వాటిని సంబంధిత స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, సాధ్యమైన మేరకు పరిష్కార మార్గాలను చూపించడంపై దృష్టి సారిస్తున్నారు. తండ్రి వద్దకు సమస్య చేరేలోపే వాటి పరిష్కారానికి దారి చూపుతున్న యువనేతగా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్న నాయకుడిగా నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. ప్రజలకు అండగా నిలవడంలో ఆయనకు ఎవరూ పోటీ కారనే మాట స్థానికంగా వినిపిస్తుంటుంది. అదే బాటలో పేదలు, ఆపన్నులకు అండగా నిలవడంలో తన తండ్రికి దీటుగా బోడే వెంకట్రామ్ ముందుకు సాగుతున్నారు. సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి అండగా నిలవడమే కాకుండా, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సాధ్యమైన సహాయం అందించేందుకు చొరవ చూపుతున్నారు.
యువతలో నిరుద్యోగ సమస్యను తగ్గించే లక్ష్యంతో నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలు నిర్వహించేలా ప్రముఖ ఐటీ సంస్థలు, నూతన సంస్థలు, ఆతిథ్య రంగం, కార్ల తయారీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యాలయం వేదికగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. పేదలు, చిరు వ్యాపారులు, దివ్యాంగులకు చేయూత అందించడంలోనూ వెంకట్రామ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పి4 కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, దివ్యాంగులకు విద్యుత్ వీల్‌చైర్లు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు చేపట్టారు. దీంతో యువతలో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
యువత క్రీడల వైపు అడుగులు వేయాలని ప్రోత్సహిస్తూ, తమ ప్రతిభను నిరూపించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను యువతకు తెలియజేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారు. రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. విఎన్‌వి ఇన్ఫ్రా డెవలపర్స్, వైష్టవి కన్‌స్ట్రక్షన్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధునాతన నిర్మాణాలు చేపడుతూ నాణ్యతతో పాటు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో గృహాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వ్యాపారం కంటే ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెంకట్రామ్ పేర్కొంటున్నారు.
2019లో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ స్థానికంగా యువతను బలోపేతం చేయడంలో వెంకట్రామ్ కీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పెనమలూరులో తెల్లవారుజాము వరకు కొనసాగిన సమయంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో చురుగ్గా వ్యవహరించారు. కింది స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు.
“ప్రజల మాట వినడం మాత్రమే కాదు.. వారి సమస్యలను అర్థం చేసుకుని, వాటిపై నిలబడి పరిష్కారం కోసం ముందుకు నడవడం తన బాధ్యత” అన్న విధానంతో బోడే వెంకట్రామ్ ముందుకు సాగుతున్నారు. తండ్రి బోడే ప్రసాద్ ప్రజలతో మమేకమై అందిస్తున్న సేవలకు తోడుగా నిలుస్తూ, యువతను కలుపుకొని, పేదలకు అండగా, ప్రజల కోసం.. ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్న ఆయన ప్రస్థానం పెనమలూరులో యువనాయకత్వానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది.