BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి.

Select Suryaa Now
పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి.

       అనపర్తి మేజర్ న్యూస్. ప్రకృతి వనరులను సంరక్షించడంతోపాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలు ప్రోత్సహించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొని పందలపాక ఎన్టీఆర్ కాలనీని సౌర విద్యుత్ వినియోగంలో మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.సేవాసేతు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో పందలపాక ఎన్టీఆర్ కాలనీలో నిర్వహించిన పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. 

ఈ సందర్భంగా సబ్సిడీ ద్వారా అందించే సోలార్ ప్యానళ్ల ప్రదర్శనను రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024లో ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులను సౌర విద్యుత్ వైపు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని వివరించారు.

బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతోందని, సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు సబ్సిడీ అందిస్తోందని, పథకం నిబంధనలను తెలుసుకొని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సౌర విద్యుత్ ఉత్పత్తి వల్ల గృహాల విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతోపాటు విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. ప్రకృతిని కాపాడుకోవడం కూడా దేశానికి సేవ చేయడమేనని అన్నారు. పందలపాక ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే వివరిస్తూ, సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో కాలనీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి హయాంలో కేశవస్వామి ఆలయానికి సంబంధించిన భూమిని సేకరించి, నివాసాలకు అనువుగా మెరక చేయడం జరిగిందని పేర్కొన్నారు.తదుపరి వివిధ దశల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని వివరించారు. ఇటీవల గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా పనిచేసిన చిన్న బుజ్జి, పద్మావతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నుంచి రూ.కోటి నిధులతో రహదారి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా మూడు విడతల్లో రూ.2 కోట్ల నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.ప్రస్తుతం కాలనీలో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు.

 ఈ నేపథ్యంలో కాలనీలోని ప్రతి కుటుంబం పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఎక్కువ మంది సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే ఎన్టీఆర్ కాలనీని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ప్రజలకు పథకంపై అవగాహన కల్పించేందుకు ఈపీడీసీఎల్ అధికారులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సబ్సిడీ వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఈపీడీసీఎల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.