పెదగదిలి శివాలయంలో కార్తీకమాస పూజలు ప్రారంభం
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ, 17వ వార్డు పెదగదిలి గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు దాకూరి శివ కన్నాజీరావు ఆధ్వర్యంలో కార్తీకమాస పూజా మహోత్సవాలు నేటి నుండి మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఆలయంలో కార్తీకమాస పూజా మహోత్సవ ఆహ్వాన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు, కార్యదర్శి ఒమ్మి వెంకట అప్పారావు,బొట్ట రమణ మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కార్తీకమాసంలో విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయని, ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఆకాశదీపారాధన, ప్రతి కార్తీక సోమవారం రోజున ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయని, 24వ తేదీన కార్తీక పౌర్ణమి మహా పర్వదినం సందర్భంగా స్వామివారికి అభిషేకాలతో పాటు సాయంత్రం లింగాకారంలో దీపారాధన, జ్వాలా తోరణం విశేషంగా జరుగుతాయని, 27వ తేదీన స్వామి వారి జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పూజలు అదేవిధంగా డిసెంబర్ 7వ తేదీన మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు, అర్చనలు జరుగుతాయని, డిసెంబర్ 8వ తేదీతో కార్తీకమాసం ముగియనుందని తెలిపారు.