పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ
పరిగి మేజర్ న్యూస్:
పరిగి మండల పరిషత్‌కు నూతన నాయకత్వం కొలువుదీరింది. గురువారం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో 17 మంది ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం RO, ఎంపీడీఓ సమక్షంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఈ ఎన్నికల్లో ఎంపీపీగా కె. శాంతమ్మ, వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన ఎంపీపీ కె. శాంతమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంపీపీ బాధ్యతలు అప్పగించిన ఎంపీటీసీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పరిగి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. మండల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పరిగి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీపీ కె. శాంతమ్మ స్పష్టం చేశారు.