లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల జర్నీ నోట్‌పై నెటిజన్ల ఆగ్రహం!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ సినీ రంగంలో అగ్ర సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంగీత దర్శకుడిగా తాను 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అనిరుధ్ ఒక సుదీర్ఘమైన భావోద్వేగ లేఖను అభిమానులతో పంచుకున్నారు. అయితే తన కెరీర్‌లో మొదటి అడుగు వేయడానికి కారణమైన హీరో ధనుష్ పేరును ఆ లేఖలో ఎక్కడా ప్రస్తావించకపోవడంపై ధనుష్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తొలి పాట విడుదలైన నాటి నుంచి నేటి వరకు తన సంగీత ప్రయాణం అద్భుతంగా సాగిందని అనిరుధ్ ఆ నోట్‌లో పేర్కొన్నారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పనిచేయడం, భారీ స్టేడియం కాన్సర్ట్‌లు నిర్వహించడం, అలాగే జైలర్ 2, ప్యారడైజ్ వంటి రాబోయే భారీ సినిమాల గురించి ఆయన ఉత్సాహంగా రాసుకొచ్చారు. దేశంలోని అగ్ర దర్శకులు, స్టార్ హీరోలు, నిర్మాతలతో పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టమని కృతజ్ఞతలు తెలిపారు. కానీ, ఇంత పెద్ద లేఖలో తనకు తొలి అవకాశం ఇచ్చిన ధనుష్ పేరు లేకపోవడం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పదిహేనేళ్ల క్రితం అనిరుధ్ ఎవరో కూడా బయటి ప్రపంచానికి తెలియని సమయంలో ఆయనలోని ప్రతిభను గుర్తించి 3 సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది ధనుష్. ఆ సినిమాలోని వై దిస్ కొలవెరి డి పాటను స్వయంగా రాసి, పాడటంతో పాటు అనిరుధ్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేయడంలో ధనుష్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా వీరిద్దరి కలయికలో వేలై ఇల్లా పట్టధారి, మారి వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. అలాంటిది కెరీర్‌కు బలమైన పునాది వేసిన వ్యక్తి పట్ల కనీస కృతజ్ఞత చూపించకపోవడం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు.
ఇటీవల జరిగిన అనిరుధ్ వివాహ వేడుకకు సైతం ధనుష్‌కు ఆహ్వానం అందలేదన్న ప్రచారం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఒకప్పుడు ప్రాణస్నేహితుల్లా మెలిగిన ధనుష్, అనిరుధ్ మధ్య దూరం ఇంతలా పెరిగిపోయిందా అని సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో అనిరుధ్ సినీ ప్రవేశానికి ధనుష్ పూర్తి కారణమని ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడిన పాత వీడియోలను నెటిజన్లు మళ్లీ వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే 15 ఏళ్ల పోస్ట్‌లో ఎవరి పేరు రాయాలనేది ఆయన వ్యక్తిగత ఇష్టమని కొందరు మద్దతు తెలుపుతుండగా, ఎదుగుదలకు కారణమైన వారిని మరవకూడదని మరికొందరు హితవు పలుకుతున్నారు.
Also Read: నాపై డాక్యుమెంటరీ తీస్తే తప్పేంటి? విమర్శకులకు నయనతార ఘాటు సమాధానం!