అమరావతి, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పీఠాల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య తుది కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ లింగమనేని రమేష్ తదితరులు భేటీ అయ్యారు.
కూటమి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించాల్సిన జడ్పీ చైర్మన్ స్థానాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధానంగా శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, శ్రీసత్యసాయి జిల్లాల జడ్పీ చైర్మన్ స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జిల్లాల వారీగా ఉన్న రాజకీయ సమీకరణాలు, గెలుపు అవకాశాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై నేతలు లోతుగా చర్చించి త్వరలోనే తుది జాబితాను ఖరారు చేయనున్నారు.