andhrapradesh
ఎంపీపీ ఎన్నికల టెన్షన్.. జనసేన ఎమ్మెల్యే అలక
విజయనగరం, నవంబర్ 19: విజయనగరం జిల్లాలో మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాల ఎన్నికలు కూటమి పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. పొత్తు ధర్మంలో భాగంగా భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించారు. అయితే, ఈ రెండు స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం స్థానిక రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. అభ్యర్థులంతా పార్టీ బీ-ఫారాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ పరిణామాలతో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తీవ్ర అసంతృప్తితో అలకబూనారు. తమ పార్టీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ పోటీకి సిద్ధమవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన జిల్లా కూటమి నాయకులు ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగి మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు, కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని పలు ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.