పరీక్షల నిర్వహణలో నిబంధనలో పాటించాలి - జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి.
బిక్కవోలు మేజర్ న్యూస్. సమ్మేటివ్–1 పరీక్షలను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వై. లక్ష్మణ్ కుమార్ సూచించారు. ఆదివారం బిక్కవోలు మండలం కాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన పరీక్షా సదుపాయాలను సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ప్రతి పాఠశాలలో పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. వారు ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించి పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా పదో తరగతి సమ్మేటివ్ పరీక్షలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం మూల్యాంకనం చేసి, మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు.అనంతరం పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు, వంటశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఇప్పటికే నిర్మించిన కళావేదిక, దేవతా విగ్రహాలను సందర్శించారు. పాఠశాలలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణారావు, ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.