నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్ల పై ఉక్కుపాదం.
అనకాపల్లిలో రెండో రోజు కొనసాగిన పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు.
అనకాపల్లి, మేజర్ న్యూస్: పట్టణంలో నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లను అరికట్టే లక్ష్యంతో పోలీసులు చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీలు రెండో రోజు కూడా ముమ్మరంగా కొనసాగాయి. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు ఆదేశాల మేరకు, అనకాపల్లి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులు తప్పుడు నంబర్ ప్లేట్లను వినియోగించడాన్ని కట్టడి చేయడంతో పాటు, విరిగిపోయిన, అస్పష్టంగా ఉన్న నంబర్ ప్లేట్ల వాడకాన్ని నియంత్రించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు అమర్చిన వాహనదారులకు జరిమానాలు విధించారు. అక్కడికక్కడే వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లను అమర్చేలా చర్యలు తీసుకున్నారు. చైన్ స్నాచింగ్, హిట్ అండ్ రన్ వంటి నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలను తక్షణమే గుర్తించేందుకు స్పష్టమైన నంబర్ ప్లేట్లు అత్యంత కీలకమని పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా వాహనదారులకు మోటార్ వాహన చట్ట నిబంధనలు, రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి వాహన దారుడు తప్పనిసరిగా మోటార్ వాహన చట్టం ప్రకారం స్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, నేర నియంత్రణ, రహదారి భద్రత కోసం పోలీసుల తనిఖీలకు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు కోరారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో అనకాపల్లి టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ సీఐ నాగేశ్వరరావు, టౌన్ ఎస్ఐ షేక్ జిలాని, ట్రాఫిక్ ఎస్ఐ డి. శేఖరం, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.