స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ
- జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలి: స్పీకర్ శుభాకాంక్షలు
నర్సీపట్నం, మేజర్ న్యూస్ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్-13 బ్యాడ్మింటన్ ఛాంపియన్ యలమంచిలి పృధ్వి మణికంఠ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని, నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి గారిని ఆదివారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పృధ్వి మణికంఠకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విధంగానే జాతీయ స్థాయిలోనూ మరిన్ని బహుమతులు, విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రామారావుపేటకు చెందిన పృధ్వి మణికంఠ, తిరుపతి వేదికగా జరిగిన యానెక్స్-సన్ రైజ్ ఏపీ రాష్ట్రస్థాయి అండర్-13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలలో సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. డబుల్స్ విభాగంలో విశాఖపట్నం క్రీడాకారుడితో కలిసి ద్వితీయ స్థానం సాధించాడు. నర్సీపట్నంలోని ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న పృధ్వి మణికంఠ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతూ రాణిస్తున్నాడు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చైర్‌పర్సన్ పద్మావతి ఆశీర్వాదాలు పొందిన పృధ్వి మణికంఠను పలువురు అభినందించారు.