నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి భారీ విజయం
విజయవాడ మేజర్ న్యూస్ : నగర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి భారీ మెజారిటీతో అత్యధిక కార్పొరేటర్ స్థానాలను కట్టబెట్టారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. నగరంలో కూటమికి లభించిన ఈ ఘన విజయం ప్రజలు తమ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని అన్నారు. విజయవాడలోని ఆయన కార్యాలయo లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాజకీయ విమర్శలు, వివాదాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరూ పనిచేయాలని సూచించారు. కొన్ని పార్టీలు కనీసం చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు కూడా సాధించలేని పరిస్థితి ఏర్పడిందని, అతి తక్కువ స్థానాలతో గెలుపొందిన వారు సైతం ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని హితవు పలికారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విజయవాడలోని అంబేద్కర్ కళావేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను అదే ప్రాంగణంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని కౌన్సిల్ హాల్‌తో పాటు ఇతర అనువైన ప్రదేశాల్లో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని వివరించారు. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా అనువైన ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించుకునేందుకు లిఖితపూర్వక అనుమతి కూడా లభించిందని, అందుకు సంబంధించిన పత్రాలను మీడియా ముందు ప్రదర్శించినట్లు తెలిపారు. అంబేద్కర్‌ను కేవలం విగ్రహాలకే పరిమితం చేయకుండా, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు మీద నిర్మించిన కళావేదికలో ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం జరగడం విజయవాడకే కాకుండా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.ఈ నెల 23వ తేదీ సోమవారం నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రజలు అందించిన విజయాన్ని ప్రజాప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా పంచుకోవాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నిబంధనలపై అవగాహన లేకుండా అనవసర ఆరోపణలు చేయడం సరికాదని, చిల్లర రాజకీయ విమర్శలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.మేయర్ నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తూ విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఎంపీ చిన్ని ధీమా వ్యక్తం చేశారు.
తిరువూరు జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట
సామాన్య కార్యకర్తలకు, కష్టపడి పనిచేసే నాయకులకు ఉన్నత పదవులు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఆ ఆశయానికి అనుగుణంగానే తిరువూరు ప్రాంతంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలిపారు.ఓసీ రిజర్వేషన్ ఉన్న జెడ్పీటీసీ స్థానం నుంచి ఎంటెక్ విద్యార్హత కలిగిన దళిత మహిళను జెడ్పీటీసీగా ఎంపిక చేయడం ద్వారా తిరువూరు నాయకులు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ కుటుంబానికి చెందిన మహిళకు అత్యున్నత పదవి కల్పించాలని నిర్ణయించడం సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు నిదర్శనమని అభివర్ణించారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకత్వం ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనను ఆమోదించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, ఇతర జెడ్పీ స్థానాల కంటే ముందుగానే ఈ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రశంసించి కూటమి నాయకులను అభినందించడం సంతోషకరమని పేర్కొన్నారు.సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సామాన్య కార్యకర్తలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని ఎంపీ చిన్ని అన్నారు.
అంబేద్కర్ కళావేదికపై అనవసర వివాదాలు సృష్టించవద్దు – వంగవీటి రాధా
ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ సోమవారం మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, ముందుగా నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.అంబేద్కర్ కళావేదికలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం ద్వారా అంబేద్కర్‌ను అవమానిస్తున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. అంబేద్కర్ ఆశయాలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఆయన పేరు మీద నిర్మించిన ప్రాంగణంలో నిర్వహించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.ప్రభుత్వ స్థలంలో, నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహిస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్ల విజయాన్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలన్న తమ ఆలోచనను కూడా కొందరు తప్పుగా చిత్రీకరించడం విచారకరమన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఇప్పటికే నిరూపిస్తున్నామని తెలిపారు.
అంబేద్కర్‌కు విజయాన్ని అంకితం చేయాలన్నదే మా సంకల్పం – బుద్ధా వెంకన్న
బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంపై విమర్శలు చేస్తున్న వారి వెనుక ఉన్న రాజకీయ శక్తులను కూడా ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రజలు కూటమికి అందించిన ఘన విజయాన్ని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అంకితం చేయాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ కళావేదికలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.త్రీ ఇడియట్స్ దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులను ఉద్దేశించి విమర్శలు చేస్తూ, కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. అంబేద్కర్ పేరుతో అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని, ఆయన పట్ల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయవాడ అభివృద్ధే మా ఏకైక లక్ష్యం
ఎన్నికల్లో ప్రజలు అందించిన ఘన విజయానికి అనుగుణంగా బాధ్యతాయుతమైన పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లందరూ సమష్టిగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని పిలుపునిచ్చారు.విజయవాడ నగర ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.