మున్సిపల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది నియామకం, టేబుళ్ల ఏర్పాటు, పోలీసు బందోబస్తు, భద్రతా చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
అమలాపురం పట్టణ స్థానిక సంస్థ కౌంటింగ్ ఏర్పాట్లు
అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం మూడు గదులను ఏర్పాటు చేసి, ప్రతి గదిలో నాలుగు టేబుళ్ల చొప్పున మొత్తం 12 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వార్డు కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
చైర్‌పర్సన్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి, ఆరు టేబుళ్ల ద్వారా మూడు రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రతి రౌండ్‌లో 12 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.