మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా సన్నద్ధం కావాలి అధికారులకు సీడీఎంఏ పి. సంపత్‌కుమార్ ఆదేశాలు
విశాఖపట్నం, మేజర్ న్యూస్ :
మున్సిపల్ సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పకడ్బందీగా సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన కమిషనర్, సంచాలకుడు పి. సంపత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల చట్టాలు, నిబంధనలు, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఏ దశలోనూ పొరపాట్లు, నిబంధనల ఉల్లంఘనలకు తావులేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ అరేనా వేదికగా బుధవారం పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. సీడీఎంఏ పి. సంపత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో పాటు విశాఖపట్నం ప్రాంత పరిధిలోని మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను పక్కాగా సిద్ధం చేసి నిబంధనల ప్రకారం ప్రచురించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అక్కడ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వెలుతురు, ర్యాంపులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన వివరాలను నిర్దేశిత విధానాల ప్రకారం సిద్ధం చేసి, రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు నిష్పక్షపాతంగా, తటస్థంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన సున్నితమైన, అధికారిక సమాచారాన్ని అనధికారికంగా వెల్లడించరాదని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ 2026 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఎన్నికల ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటి పరిసరాలు, భవనాల అనుకూలత, ముఖ్యంగా భూతలంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలను ముందుగానే అందుబాటులో ఉంచాలన్నారు. ఓటర్ల జాబితాల్లో నకిలీ లేదా పునరావృత నమోదులు, ఇతర పొరపాట్లు లేకుండా పరిశీలించాలని సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియను జనాభా వివరాలు, ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత విధివిధానాల ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని కేతన్‌గార్గ్ సూచించారు.
అనంతరం ఎంఏ అండ్ యూడీ అదనపు సంచాలకుడు రవీంద్రబాబు, ప్రాంతీయ సంచాలకుడు వారా రవీంద్ర ఎన్నికల సంసిద్ధతపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు చేపట్టాల్సిన చర్యలు, నోటిఫికేషన్ అనంతరం అనుసరించాల్సిన విధివిధానాలు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది విధులు, పోలింగ్ నిర్వహణ, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.
సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి. రమణమూర్తి, పి.ఎం. సత్యవేణి, పి. నల్లనయ్య, డీపీఓ నాగార్జున, జోనల్ కమిషనర్లు, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.