మూడవ రోజుకు చేరిన 59వ గ్రంథాలయ వారోత్సవాలు : గ్రంథాలయ ఉద్యమకారుల సేవలను స్మరించుకున్న ప్రముఖులు : హాజరైన చిత్తూరు జిల్లా స్కౌట్స్ కమిషనర్ శకుంతలమ్మ
మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలో ప్రధాన శాఖ గ్రంథాలయం నందు 59వ గ్రంథాలయ వారోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి.ఇందులో భాగంగా సోమవారం గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకునే కార్యక్రమం నిర్వహించారు.స్వాతంత్రోద్యమ కాలంలో గ్రంథాలయాల ద్వారా ఉత్తేజితులను చేసిన దుర్గాబాయి దేశముఖ్,ఎస్ఆర్ఆర్,అయ్యంకి వెంకటరమణయ్య పంతులు,పాతూరి నాగభూషణం మొదలైన ఉద్యమకారులను మననం చేసుకుంటూ హాజరైన బాలబాలికలకు వారి చరిత్రను వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హెడ్మాస్టర్,చిత్తూరు జిల్లా స్కౌట్స్ కమిషనర్ శకుంతలమ్మ అపారమైన తమ అనుభవాలను వివరిస్తూ గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఎలా ఉన్నతులు కాగలరో తెలియజేశారు.ప్రత్యేక అతిథిగా విచ్చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజరు కోటిరెడ్డి తాము అంధులైనా ఆత్మవిశ్వాసంతో ఒక్కో అడుగే ముందుకేసి జీవితంలో ఎలా పైకెదిగారో తెలియజేశారు.విద్యార్థినీ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లైబ్రరీ సేవలను వినియోగించుకుంటూ ముందుకు సాగాలని ఉద్బోధించారు.రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ల కోదండరామిరెడ్డి,నాగరాజ బాబులు విద్యార్థులకు ఉపయోగపడు అమూల్యమైన 151 గ్రంథాలను అందజేశారు.మరో అతిథిగా విచ్చేసిన ఇంజనీర్ విజయ్ కుమార్ తమ విద్యానుభవాలలు,యాత్రానుభవాలు,గ్రంథ పఠనానుభవాలను వివరిస్తూ గ్రంథ పఠనం మనుషులను ఎలా ఉన్నత స్థితికి తీసుకు వెళ్తుందో తెలియజేశారు.ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల గంధ పాలకురాలు శారద గ్రంథాలయ పుట్టుపూర్వోత్తరాలను వివరించారు.ప్రఖ్యాత మోటివేటర్ రామ్మూర్తి తమదైన శైలిలో విద్యార్థులకు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడం వల్ల కలిగే లాభాలను సాదోహరంగా వివరించారు.గవర్నర్ నుండి అవార్డు పొంది వచ్చిన స్కౌట్స్ ప్రాంతీయ కమిషనర్ శకుంతలమ్మని సభకు పరిచయం చేస్తూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని ఉటంకరించి విద్యార్థినీ,విద్యార్థులకు సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ గొల్లపూడి తిలపతిరావు తెలియజేశారు.ప్రఖ్యాత కథా నవలా రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి తాను తన మిత్రులు 11 ఏళ్ల వయసులో భయపడుతూ గ్రంథాలయంలోనికి వెళ్లడం తర్వాత గ్రంథాలయంలోని పుస్తకాలను ఉపయోగించుకుంటూ భాష మీద సాధికారత సాధించడం,ఒక్కో అడుగే ముందుకు వేసుకుంటూ అటు ఉద్యోగంలో ఇటు రచయితగా రాణించడానికి దోహదపడిన గ్రంథాలయం తనకు మరో తల్లి అని ఆ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని విద్యార్థినీ,విద్యార్థులు అందరూ ఉన్నత స్థితికి ఎదగాలని తెలియజేశారు.అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వర్తించిన గ్రంథ పాలకురాలు వసంత కుమారి అతిథులకు విద్యార్థినీ,విద్యార్థులకు కృతజ్ఞతాభివందనములు
తెలియజేస్తూ అతిథులందరినీ శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది జయమ్మ,సాయి చైతన్య కాలేజీ,ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల అధ్యాపకులు,విద్యార్థినులు,పాఠకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి