మంత్రి నారా లోకేష్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ
ఏలూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఎంపీ, జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులను చర్చించడంతోపాటు, ఏలూరు పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చిన అంశాల్లో ముఖ్యంగా.. ఏలూరులో బీసీ హాస్టల్ నిర్మాణానికి 2 కోట్లు, ఏలూరు పట్టణంలో జిల్లా గ్రంథాలయం నిర్మాణానికి 3 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక శాఖ నుంచి ఫైనాన్సియల్ క్లియరెన్స్ ఇప్పించమని కోరిన ఎంపీ, నూజివీడు త్రిబుల్ ఐటీ లో ఆధునికీకరణ, సౌకర్యాల కల్పనకు 12 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని రాజకీయ పరిస్థితులు, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఇరువురూ కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి పనులు, కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని నారా లోకేష్ కి అందించారు. పుస్తకాన్ని పరిశీలించిన లోకేష్ చేసిన పనులను ఇలా పుస్తక రూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు.
పసుమర్తి రాము రాము జిల్లా ఇంచార్జ్