మంచినీటి సమస్య పరిష్కారం కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర
అనంతపురం బ్యూరో : రాజీవ్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శిల్పారామం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు 13 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి వినతిపత్రం అందజేసి, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి వి. రామిరెడ్డి మాట్లాడుతూ.. శిల్పారామంలో రూ.1.78 కోట్లతో మంచినీటి ట్యాంకు నిర్మించి ఏడాది దాటినా కాలనీలకు నీరు అందడం లేదని ఆరోపించారు. మహదేవ్‌నగర్, నేతాజీ నగర్, భగత్‌సింగ్ నగర్, ప్రియాంక నగర్, గణేనాయక్ నగర్, రామయ్య కాలనీలలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాజీవ్ కాలనీ మెయిన్ రోడ్డుకు గతంలో మంజూరైన రూ.67 లక్షల పనులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మంచినీటి సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. రాజీవ్ కాలనీ రోడ్డు పనులపై ఉన్నతాధికారులతో చర్చించి ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో పనులు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.