మానవ సంబంధాలే ఉన్నత శిఖరాలకు పునాదులు...
శ్రీకాకుళం, సూర్య : విద్యార్థుల భవిష్యత్తుకు విద్య ఎంత ముఖ్యమో, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి మానవ సంబంధాలు, గురువుల పట్ల గౌరవం, పెద్దల పట్ల వినయం కూడా అంతే ముఖ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మన ఎదుగుదలకు తోడ్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదని, నిజమైన ప్రేమాభిమానాలతో ఏర్పడిన బంధాలే జీవితంలో మనకు అండగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
కిష్టప్పపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న తొలి బ్యాచ్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గొండు శంకర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయుడు బలివాడ సూర్యనారాయణ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుశిష్యుల బంధం ఎంతో పవిత్రమైనదని అన్నారు. తాను ప్రజాప్రతినిధిగా ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవం, అభిమానం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం ఉపాధ్యాయులతో తనకు ఎలాంటి అనుబంధం ఉండేదో, నేడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అదే ఆత్మీయత, అదే వినయాన్ని కొనసాగిస్తున్నానని తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మన ఎదుగుదలకు కారణమైన గురువులను ఎప్పటికీ మరిచిపోకూడదని విద్యార్థులకు హితవు పలికారు.
సమాజంలో కేవలం పైకి కనిపించే పరిచయాలకే పరిమితం కాకుండా, మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలు పంచుకునే సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచించారు. ఇతరులను మభ్యపెట్టే నటనతో కాకుండా నిజాయితీతో కూడిన ప్రవర్తనతో అందరి మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని అన్నారు. అటువంటి ఆత్మీయ బంధాలే భవిష్యత్తులో మనం ఏ స్థాయిలో ఉన్నా అండగా నిలుస్తాయని వివరించారు.
తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలని పేర్కొంటూ, పిల్లలు తల్లిదండ్రుల నుంచి మంచి విషయాలను నేర్చుకోవడంతోపాటు, అవసరమైన సందర్భాల్లో వారికి కూడా మంచి విషయాలను సున్నితంగా తెలియజేయాలని సూచించారు. గురువుల బోధనలు, తల్లిదండ్రుల సూచనలు జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని చెప్పారు.
కిష్టప్పపేట పాఠశాలలో పదో తరగతి ప్రారంభమైన తొలి బ్యాచ్ విద్యార్థులు కావడంతో ఈ విద్యా సంవత్సరం వారికి ప్రత్యేకమైనదని, మంచి క్రమశిక్షణతో చదువుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాల చరిత్రలో తొలి విజయవంతమైన బ్యాచ్‌గా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్టడీ మెటీరియల్ అందించిన పూర్వ ప్రధానోపాధ్యాయుడు బలివాడ సూర్యనారాయణను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ గురువుల పట్ల వ్యక్తం చేసిన గౌరవం, విద్యార్థులకు అందించిన జీవిత పాఠాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.