కుటుంబ పెద్ద మృతి.. యధావిదంగా వ్యాపార లావాదేవీలు. బెంగళూరు బేకరీ యాజమాన్యం పై విమర్శలు.
అనంతపురం: కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలోనూ వ్యాపార కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించడంపై అనంతపురం నగరంలోని బెంగళూరు బేకరీ యాజమాన్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారం, ఆదాయం కంటే కుటుంబ సభ్యుల పట్ల గౌరవం, ఆప్యాయత, సంతాపానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భంలో బేకరీలను మూసివేయకుండా కొనసాగించడం పలువురిని ఆవేదనకు గురిచేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం పొట్ట చేత పట్టుకుని అనంతపురం నగరానికి వచ్చిన స్వామి, 1976లో టవర్ క్లాక్ సమీపంలో నెలకు వెయ్యి రూపాయల అద్దెతో చిన్న బేకరీని ప్రారంభించారు. అప్పట్లో అనంతపురం నగరం నేటి స్థాయిలో అభివృద్ధి చెందకపోయినా, తన కష్టాన్ని నమ్ముకుని స్వామి వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ బ్రెడ్, ఇతర బేకరీ ఉత్పత్తులను తయారు చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తయారు చేసిన ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ పెరగడంతో చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారం క్రమంగా విస్తరించి పెద్ద వ్యాపార సంస్థగా ఎదిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బెంగళూరు బేకరీ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. వ్యాపారం విస్తరించినప్పటికీ స్వామి తన పనిపట్ల అంకితభావాన్ని కొనసాగించారని ఆయనను దగ్గరగా తెలిసినవారు చెబుతున్నారు. సిబ్బంది అందుబాటులో లేకపోయినా స్వయంగా బేకరీ పదార్థాల తయారీలో పాల్గొంటూ నాణ్యత విషయంలో రాజీ పడకుండా వ్యవహరించేవారని గుర్తుచేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల వయసులో నగరానికి వచ్చిన ఆయన, 70 ఏళ్ల వయసులోనూ వ్యాపార పనుల్లో చురుకుగా ఉండటం ఆయన కష్టపడి ఎదిగిన తీరుకు నిదర్శనంగా నిలిచింది. నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ప్రతిరోజూ బ్యాడ్మింటన్ ఆడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ స్నేహపూర్వకంగా మెలిగేవారని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. అయితే బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న యువకులు సీపీఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు. తొలుత కోలుకోవడంతో ఆయన మృత్యుంజయుడయ్యారని పలువురు భావించినప్పటికీ, అనంతరం చికిత్స పొందుతూ స్వామి కన్నుమూయడం కుటుంబ సభ్యులు, పరిచయస్తులు, అభిమానులను విషాదంలో ముంచింది. ఇంతటి సుదీర్ఘ వ్యాపార ప్రస్థానం సాగించిన వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఆయనకు నివాళిగా, కుటుంబ సభ్యుల సంతాపానికి సంఘీభావంగా బేకరీ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాల్సిందని పలువురు నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక మార్కెట్లలో వ్యాపారులు లేదా ఇతర ప్రముఖులు మరణించిన సందర్భాల్లో తోటి వ్యాపారులు సంతాప సూచకంగా దుకాణాలు మూసివేసే సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు కుటుంబ పెద్ద మరణించినప్పటికీ బేకరీ కార్యకలాపాలు కొనసాగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కుటుంబ విలువలు, మానవీయ భావాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో యాజమాన్యం స్పందించాలని పలువురు కోరుతున్నారు.