కొత్తూరులో రూ.1.13 కోట్లతో నాలుగు శ్మశాన వాటికలు
శ్మశాన వాటికలను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు
బీజీఆర్ కోల్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సామాజిక బాధ్యత నిధులతో అభివృద్ధి
నెల్లూరు, మేజర్ న్యూస్ : మనిషి బతికున్నంత కాలం గౌరవంగా జీవించడం ఎంత ముఖ్యమో, చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదంగా సాగనంపడం అంతే ముఖ్యమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇందుకూరుపేట మండలం, కొత్తూరు పంచాయతీ పరిధిలో బిజీఆర్ కోల్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులు మొత్తం రూ.1.13 కోట్లతో వివిధ వర్గాల కోసం అభివృద్ధి చేసిన నాలుగు శ్మశాన వాటికలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు స్థానిక కూటమి నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా బీసీల శ్మశాన వాటికను రూ.60 లక్షలతో, ఎస్సీల శ్మశాన వాటికను రూ.25 లక్షలతో, సాధారణ ప్రజల శ్మశాన వాటికను రూ.18 లక్షలతో, ఎస్టీల శ్మశాన వాటికను రూ.10 లక్షలతో తీర్చిదిద్దారు. ఈ రకంగా ప్రతి వర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ శ్మశాన వాటికలను తీర్చిదిద్దిన దాతలు బిజీఆర్ సంస్థను, ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన గునపాటి రమేష్ రెడ్డి దంపతులను వేమిరెడ్డి దంపతులు అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ, ఎమ్మెల్యే దంపతులు మాట్లాడారు.
ప్రతి గ్రామానికి మౌలిక వసతులు - సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీరు, శ్మశాన వాటికల కొరత తీవ్రంగా ఉందని ప్రజలు తన దృష్టికి తెచ్చారని గుర్తుచేశారు. ఆ రోజు తాను ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని, ఏ గ్రామంలోనైనా సమస్య వస్తే 24 గంటల్లో మోటార్లు రిపేర్ చేయిస్తున్నామని, ఆలస్యమైతే ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నామని తెలిపారు. బిజీఆర్ సంస్థ, దాత రమేష్ గారి సహకారంతో రూ.1.13 కోట్లతో చేపట్టిన ఈ నాలుగు శ్మశాన వాటికల నిర్మాణం చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతం చేశామని, ఈరోజు సాయంత్రం కూడా బుచ్చిరెడ్డిపాళెంలో రూ.25 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. అదేవిధంగా స్థానికులు కోరిన సమస్యలపై స్పందిస్తూ, కొత్తూరు బీసీ కాలనీలో డ్రెయిన్స్ నిర్మాణానికి ఇప్పటికే రూ.20 లక్షలు మంజూరు చేశామని, ఒకటి రెండు రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీబీ జీ రామ్ జీ, హ్యామ్ పథకాల కింద తమ నియోజకవర్గానికి రూ.పది కోట్లు వరకు మంజూరు చేశారని, వీటితో ప్రతి ఊర్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఎస్టీ గృహాలు, హౌసింగ్ పనులను తిరిగి ప్రారంభించడానికి సీఎం గారు కొత్త జీవో తెచ్చారని, అర్హులైన పేదలందరికీ స్థలాలు, పట్టాలు ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడి విధివిధానాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా ఒక్క ఇందుకూరుపేట మండలంలోనే రూ.2 కోట్ల విలువైన 36 అభివృద్ధి పనులు మంజూరయ్యాయని వివరించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతతో గ్రామాభివృద్ధి అభినందనీయం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి : నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, సొంత పేరు కోసమో, అవసరాల కోసమో కాకుండా ఊరి ప్రజలందరి సంక్షేమం కోసం చేసే ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమాలు ఎంతో సంతోషాన్నిస్తాయని కొనియాడారు. బిజీఆర్ సంస్థ తమ సీఎస్ఆర్ నిధులు రూ.1.13 కోట్లతో అన్ని వర్గాలకు శ్మశాన వాటికలు నిర్మించి ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రూ.11,000 కోట్లు గ్రామీణాభివృద్ధికి, రూ.11,360 కోట్లు హ్యామ్ కింద పట్టణాభివృద్ధికి కేటాయించారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ పాలన అందిస్తోందని ఎంపీ గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు, ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యాయని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. ప్రజలకు జరిగిన మంచిని దృష్టిలో ఉంచుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందుకూరుపేట మండలంతో పాటు కోవూరు నియోజకవర్గంలోని ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి నాయకులు, బిజీఆర్ సంస్థ ప్రతినిధులు గునపాటి రమేష్ రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.