కూటమితోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యం సామినేని ఉదయభాను
కూటమితోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యం సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-పోచంపల్లి, గౌరవరం గ్రామాల్లో విస్తృత పర్యటన.. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు.
రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పోచంపల్లి, గౌరవరం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించారు.
కూటమి బలపరిచిన జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కోసూరు ప్రహ్లాద్ విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పోచంపల్లి గ్రామానికి చెందిన చింతా రెడ్డి లీలావతి కి అదేవిధంగా గౌరవరం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి కట్ట సత్యవతి విజయానికి కృషి చేయాలని స్థానిక కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందాలంటే ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
పల్లె పండుగతో గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత లభిస్తోంది. గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పశువుల కోసం మినీ గోకులాలు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా