కూటమి కలిస్తే ఏకపక్ష విజయం ఖాయం..!!
ఆనందపురం, సూర్య : మూడు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గిడిజాలలోని రిసార్ట్స్‌లో శనివారం నిర్వహించిన ఆనందపురం జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 94 శాతం విజయాల రేటు సాధించిన కూటమి, స్థానిక ఎన్నికల్లోనూ జెడ్పీటీసీతో పాటు 17 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పొత్తుల కారణంగా టికెట్లు దక్కని ఆశావహులకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు, పంచాయతీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ ఆగడాలను సహించబోమని, అభ్యర్థులకు సహకారం అందించేందుకు భీమిలిలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎన్నికల పరిశీలకుడు ఎం.ఎ. షరీఫ్ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిలో కూటమి అభ్యర్థులు భాగస్వాములు కావాలని, స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌ఛార్జి చిక్కాల విజయ్‌బాబు, జనసేన ఇన్‌ఛార్జి పంచకర్ల సందీప్, బీజేపీ ఇన్‌ఛార్జి జీరు కైలాష్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు, జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావు, ఘట్టమనేని సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.