కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా బత్తలపల్లిలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇంటింటా ప్రచారం
బత్తలపల్లి, సూర్య మేజర్ న్యూస్ :
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మండలంలో విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మండలంలోని పలు ప్రాంతాలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లారు. జడ్పిటిసి స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న జక్కంపూడి స్వరూప రాణికి, అలాగే కూటమి తరఫున బరిలో నిలిచిన ఎంపీటీసి అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే మండల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జెడ్పిటిసి అభ్యర్థి జక్కంపూడి స్వరూప రాణిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు.
జంపుల అజయ్ చౌదరి సత్యసాయి జిల్లా కరస్పాండెంట్