కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం.
కాలం మారుతున్న, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా.. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికీ కట్టుబాటుగా పాటిస్తున్నారు. అలాంటి అరుదైన సంప్రదాయానికి నిలువుటద్దంగా నిలుస్తోంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం తమ్మయ్యదొడ్డి గ్రామం. ఈ గ్రామంలో కోడి కూత వినిపించదు. కోళ్ల పెంపకం కనిపించదు. కోడి మాంసం తినరు.. కోడిగుడ్డు కూడా ముట్టరు. సుమారు వందేళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం నేటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతుండటం విశేషం. తమ్మయ్యదొడ్డి గ్రామంలో సుమారు 60 కుటుంబాలకు చెందిన 450 మంది నివసిస్తున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద కోళ్ల పెంపకం సర్వసాధారణం. కోడి మాంసం, కోడిగుడ్లు ఆహారంలో భాగంగా ఉంటాయి. అయితే తమ్మయ్యదొడ్డి గ్రామంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. గ్రామంలో కోళ్లను పెంచకూడదనే నిబంధనతో పాటు కోడి మాంసం, కోడిగుడ్లు తినకూడదనే ఆచారాన్ని గ్రామస్థులు కచ్చితంగా పాటిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారు. గ్రామస్థులు చెబుతున్న కథనం ప్రకారం.. సుమారు వందేళ్ల క్రితం గ్రామంలో వరుసగా అనేక అరిష్టాలు చోటుచేసుకున్నాయని చెబుతారు. వాటి నుంచి గ్రామాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పటి గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారని స్థానికులు వివరిస్తున్నారు. గ్రామ పొలిమేరల చుట్టూ గోపంచకం చల్లి పూజలు చేసిన అనంతరం కోడి, కోడిగుడ్లను పూర్తిగా వదిలేయాలని గ్రామస్థులతో ప్రమాణం చేయించినట్లు చెబుతున్నారు. అప్పటి నుంచి కోళ్ల పెంపకం, కోడి మాంసం, కోడిగుడ్ల వినియోగానికి దూరంగా ఉండటాన్ని గ్రామస్థులు ఆచారంగా స్వీకరించారని స్థానికుల కథనం. ఈ సంప్రదాయం వెనుక మరో కథనం కూడా గ్రామంలో ప్రచారంలో ఉంది. గతంలో గ్రామంలో జరిగిన జాతర సందర్భంగా కొందరు కోళ్లను కోసుకుని, మద్యం సేవిస్తూ వేడుకల్లో నిమగ్నమయ్యారని గ్రామస్థులు చెబుతున్నారు. అదే సమయంలో దుండగులు గ్రామంపై దాడి చేసి దోపిడీకి పాల్పడినట్లు స్థానికుల కథనం. ఈ ఘటనతో అప్రమత్తమైన గ్రామ పెద్దలు సమావేశమై భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కోళ్ల పెంపకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కోడి మాంసం, కోడిగుడ్లు తినకూడదని గ్రామస్థులతో నిర్ణయం తీసుకున్నారని స్థానికులు వివరిస్తున్నారు. అయితే ఈ రెండు కథనాలు గ్రామస్థులు తరతరాలుగా చెబుతున్న సంప్రదాయ కథనాలుగానే ఉన్నాయి. తమ్మయ్యదొడ్డిలో ఈ ఆచారం కేవలం పెద్దలకే పరిమితం కాలేదు. కుటుంబాల్లోని చిన్నాపెద్దా అందరూ దీనిని పాటిస్తున్నారు. గ్రామంలోకి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చే కోడళ్లు సైతం ఈ సంప్రదాయాన్ని అనుసరించాల్సి ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. తరతరాలుగా వస్తున్న నియమాన్ని కుటుంబ సభ్యులందరూ గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామంలో కోళ్లను పెంచకపోయినా మేకలు, గొర్రెల పెంపకం కొనసాగుతోంది. వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. కానీ కోడి మాంసం, కోడిగుడ్ల విషయంలో మాత్రం గ్రామస్థులు తమ ఆచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరు. ఆధునిక జీవనశైలి విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలోనూ ఒక గ్రామం మొత్తం దశాబ్దాలుగా ఒకే సంప్రదాయాన్ని పాటించడం ఆసక్తిని కలిగిస్తోంది. తమ్మయ్యదొడ్డి గ్రామంలో కోడి కూత వినిపించకపోవడం, కోడిగుడ్డు కూడా తినకపోవడం వెనుక ఉన్న కారణాలపై గ్రామస్థులు చెప్పే కథనాలు స్థానిక సంప్రదాయాల ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. తరతరాలుగా వస్తున్న విశ్వాసాలు, గ్రామ పెద్దల నిర్ణయాలు ప్రజల జీవన విధానంపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ గ్రామ ఆచారం తెలియజేస్తోంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి.