జిల్లేడు ద్రావణంతో ప్రకృతి వ్యవసాయానికి బలం
బాడంగి, సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్): ప్రకృతి వ్యవసాయంలో రైతులు స్థానికంగా లభించే సహజ వనరులను సద్వినియోగం చేసుకుని పంటలకు అవసరమైన ద్రావణాలను తయారు చేసుకోవాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూచించారు. ఈ మేరకు బుధవారం గజరాయునివలస గ్రామంలో రైతులతో కలిసి జిల్లేడు ద్రావణాన్ని తయారు చేశారు.
ప్రకృతి వ్యవసాయ ఎఫ్ఎంటీ వై. ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ద్రావణం తయారీ విధానాన్ని, పంటలపై దాని ఉపయోగాలను వివరించారు. 100 లీటర్ల నీటికి 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కిలోల జిల్లేడు ఆకులను కలిపి మూడు రోజుల పాటు నానబెట్టి మురగనివ్వాలని తెలిపారు. అనంతరం వడకట్టి ట్యాంకుకు రెండు లీటర్ల చొప్పున కలిపి పంటలపై పిచికారీ చేయాలని సూచించారు.
ఈ ద్రావణం పంటలకు సహజ రక్షణ కల్పించడంతో పాటు తెగుళ్లు, పురుగుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని సిబ్బంది వివరించారు. రైతులు రసాయన ఆధారిత వ్యవసాయాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఆర్‌పీ ఎం. సత్యనారాయణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.