జలమయమైన పోర్ట్ పునరావాస కాలనీ
సంతబొమ్మాళి,అక్టోబర్ 30, మేజర్ న్యూస్ :
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తోడు వరద నీరు పోటెత్తడంతో మూలపేట పోర్టు పునరావాస కాలనీ జలమయమైంది. నౌపడలో నిర్మించిన మూలపేట, విష్ణుచక్రం పునరావాస కాలనీల్లోకి వరద నీరు చేరడంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. ఇళ్లలోకి, బాత్రూముల్లోకి నీరు చేరడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వంటలు చేసుకునేందుకు కూడా వీలులేక అవస్థలు పడ్డారు.
కాలనీలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో బయటకు వెళ్లాలన్నా, కనీస అవసరాలు తీర్చుకోవాలన్నా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా సరైన సదుపాయం లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చి పెట్టుకున్న ఇసుక, సిమెంట్ బస్తాలు వరద నీటికి తడిసిపోయాయి. సిమెంట్ బస్తాలు గట్టిపడిపోగా, ఇసుక వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఇళ్లు నిర్మించుకుంటున్న నిర్వాసితులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది.
కాలనీలో డ్రైనేజీలు, రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో చేపట్టడం వల్లే వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక కాలనీ మొత్తం ముంపునకు గురవుతోందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. పునరావాస కాలనీ పక్కన ఉన్న పోర్టుకు రహదారిని ఎత్తులో నిర్మించడంతో పాటు, వరద నీరు వెళ్లేందుకు సరిపడా కల్వర్టులు ఏర్పాటు చేయకపోవడం కూడా ముంపునకు కారణమని వాపోతున్నారు. కాలనీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తే బయటి నుంచి వరద నీరు లోపలికి రాకుండా అడ్డుకోవచ్చని నిర్వాసితులు అంటున్నారు.
సొంత గ్రామాల్లో ఎంతో దర్జాగా బతికిన తాము పోర్టు నిర్మాణం కోసం సొంత ఊరు, భూములను త్యాగం చేసి పునరావాస కాలనీకి వచ్చామని, ఇక్కడ కనీస సౌకర్యాలు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్లు, భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ కాలనీ ముంపునకు గురవుతుండటంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నిలిచిన వరద నీటిని తొలగించడంతో పాటు, శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతున్నారు. నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీని టెక్కలి ఆర్డిఓ కృష్ణమూర్తి పరిశీలించి ముంపు నీటిలోనే నడిచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కరించుటకు తమ వంతుగా కృషి చేస్తానని నిర్వాసితులకు ఆయన హామీ ఇచ్చారు .