జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు.. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
అవనిగడ్డ, మేజర్ న్యూస్: కృష్ణా జిల్లాలో గురువారం (నవంబర్ 5) నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత అవనిగడ్డ రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అవనిగడ్డ మండలంలోని 38 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిణీ చేసి సిబ్బందిని నేరుగా కేంద్రాలకు పంపిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు లేదా వెబ్‌క్యామ్‌ల ద్వారా వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. జూనియర్ కళాశాలలో కోడూరు, చల్లపల్లి, నాగాయలంక మండలాలకు, ఉన్నత పాఠశాలలో అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుందని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూముల భద్రత, సిబ్బందికి భోజన సదుపాయాలు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ హరిహరినాథ్, తహసీల్దార్ అంకాలు, ఇన్‌చార్జి ఎంపీడీవో ఎం.వనజ తదితరులు ఉన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.