జాతీయ సదస్సులో సత్తా చాటిన నారాయణ ఫార్మసీ విద్యార్థులు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని ప్రతిష్టాత్మక నారాయణ ఫార్మసీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన చివరి సంవత్సరం బి.ఫార్మసీ విద్యార్థులు అరవింద్ శ్రీవాస్తవ, రెడ్డి బసవ రాజు గౌడ్ ఇటీవల జరిగిన ఓ జాతీయ స్థాయి సదస్సులో అద్భుత ప్రదర్శన ఇచ్చి ద్వితీయ బహుమతులు సాధించారు. రత్నం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (నెల్లూరు), ఏపీఐటీ–ఏపీ స్టేట్ బ్రాంచ్ సంయుక్త సహకారంతో సెప్టెంబర్ 29, 2026న ప్రతిష్టాత్మక 4వ జాతీయ సదస్సును నిర్వహించింది. “ఔషధ ఆవిష్కరణలో పర్యావరణహిత వ్యూహాలు” (నెక్స్ట్ జనరేషన్ ఎకో-ఫ్రెండ్లీ స్ట్రాటజీస్ ఫర్ ఏఐ ట్రాన్స్‌ఫార్మేటివ్ డ్రగ్ డిస్కవరీ) అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు జరిగింది. ఈ వేదికపై నిర్వహించిన ఓరల్, ఈ-పోస్టర్ ప్రజెంటేషన్‌ల విభాగాల్లో నారాయణ ఫార్మసీ విద్యార్థులు అరవింద్ శ్రీవాస్తవ, రెడ్డి బసవ రాజు గౌడ్ తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. సరికొత్త ఔషధాల ఆవిష్కరణలో కృత్రిమ మేధ, పర్యావరణహిత విధానాల ఆవశ్యకతను వారు అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించారు.
విద్యార్థులు సాధించిన ఈ విజయం పట్ల నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నారాయణ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాసులు, డైరెక్టర్ డాక్టర్ బి.దత్తాత్రేయ శర్మ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.