జాబితాలో పేరున్నా.. చేతికి అందని సాయం!
వారం రోజులుగా రేషన్ డిపో చుట్టూ ప్రదక్షిణలు. నిరుపేద మత్స్యకార కుటుంబానికి తప్పని అవస్థలు!. మేము చేసిన పాపమేమిటి.. అంటూ బాధితుల ఆవేదన
సంతబొమ్మాళి, నవంబర్ 17, మేజర్ న్యూస్ :
ప్రకృతి విపత్తుల వేళ ప్రభుత్వం అందించే సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో మాత్రం కొందరికి అందని ద్రాక్షగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ జాబితాలో పేరు ఉన్నప్పటికీ, వారం రోజులుగా రేషన్ డిపో చుట్టూ తిరుగుతున్నా బియ్యం, నిత్యావసర సరుకులు అందక ఓ నిరుపేద మత్స్యకార కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మేము చేసిన పాపమేమిటి? మాకెందుకు ఈ అన్యాయం? అంటూ బాధితులు యంపల్ల చిన్నారావు, దేవి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మేఘవరం పంచాయతీ పరిధి యంపల్లవానిపేట గ్రామానికి చెందిన చిన్నారావు, దేవి దంపతుల కుటుంబానికి మురసు తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జాబితాలో చోటు లభించింది. అయినప్పటికీ సంబంధిత రేషన్ డిపో డీలర్ వారం రోజులుగా తిప్పుతున్నారే తప్ప సరుకులు పంపిణీ చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
తమకు అందిన సమాచారం ప్రకారం మత్స్యకారులు కాని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాలుగు కుటుంబాలకు సైతం సరుకులు పంపిణీ చేశారని, ప్రభుత్వం గుర్తించిన నిరుపేద మత్స్యకార కుటుంబమైన తమకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒకే గ్రామంలో అర్హతల విషయంలో ఇలాంటి వ్యత్యాసం ఎందుకు చోటుచేసుకుందో అధికారులే సమాధానం చెప్పాలని కోరుతున్నారు.
ఈ విషయాన్ని మత్స్యశాఖ, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా జాబితాలో మీ పేరు ఉందని, డీలర్‌కు చెబుతామని సమాధానం ఇస్తున్నారే తప్ప తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని బాధితులు వాపోతున్నారు. జాబితాలో తమ పేరు ఉన్నట్లు చూపించే ఆధారాలను సైతం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ సాయం అర్హులైన కుటుంబాలకు సకాలంలో చేరేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జాబితాలో పేరు ఉండి కూడా సరుకులు అందకపోవడం వెనుక కారణాలేమిటని , పంపిణీలో ఏవైనా అవకతవకలు జరిగాయా అనే అంశాలపై సంబంధిత అధికారులు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని బాధిత మత్స్యకార కుటుంబం వేడుకుంటోంది.