ఇంద్రకీలాద్రిపై నవంబర్ 24న కార్తీక దీపోత్సవం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: పరాభవ నామ సంవత్సర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహోత్సవానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదేశించారు. దీపోత్సవ వేడుకను సుందరంగా నిర్వహించేందుకు దేవస్థానం పరిధిని ఎనిమిది ప్రధాన సెక్టార్లుగా విభజించారు. ప్రధాన ఆలయం, అష్టలక్ష్మి మండపం, ఉపాలయాలు, ఆర్జిత సేవా ప్రాంగణాలు, చిన్న రాజగోపురం, ఓం టర్నింగ్, మల్లేశ్వర స్వామివారి ఆలయ మార్గం, మహామండపం నుంచి దిగువన ఉన్న కనకదుర్గ నగర్ ప్రారంభ ప్రాంతం వరకు దీపాలంకరణలు చేపట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఓం, స్వస్తిక్, శివలింగం, శ్రీచక్రం వంటి ఆధ్యాత్మిక ఆకృతులతో రంగవల్లులు, పూల అలంకరణలు, దీపాల ఏర్పాటు కోసం 700 మందికి పైగా సేవాదారులను వినియోగించనున్నారు. ఆలయ పరిసరాలను మామిడి తోరణాలు, అరటి చెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అదే రోజు రాత్రి శివాలయంలో జ్వాలా తోరణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.