ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల స్వీకరణ.. భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న భవానీ మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం రెండో రోజు శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది. వందలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి మహామండపం ఆరో అంతస్తులో కొలువుదీరిన భవానీ అమ్మవారి సన్నిధిలో గురుభవానీల సమక్షంలో శాస్త్రోక్తంగా దీక్షా మాలధారణ చేశారు. శనివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. ఘాట్ రోడ్డు, లిఫ్ట్ మార్గాల ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దర్శనం టికెట్ కౌంటర్లు, ప్రసాదం టికెట్ కౌంటర్లు, చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్‌లను పరిశీలించారు. టికెట్ కౌంటర్లు, స్కానింగ్ పాయింట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. టికెట్ల జారీ, స్కానింగ్ ప్రక్రియలో అప్రమత్తంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, భక్తులకు సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.