గుడిపల్లిలో టీడీపీ విజయదుందుభి
13 ఎంపీటీసీ స్థానాలకు 13 స్థానాలూ కైవసం.. టీడీపీ క్లీన్ స్వీప్
విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు
గుడిపల్లి మేజర్ న్యూస్:
గుడిపల్లి మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించి, అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో గుడిపల్లి మండలంలో టీడీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఈ సందర్భంగా గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఈ విజయం పార్టీ నాయకుల సమష్టి కృషికి, కార్యకర్తల అహర్నిశల శ్రమకు, ప్రజలు తెలుగుదేశం పార్టీపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గ్రామగ్రామాన తిరుగుతూ కష్టపడిన నాయకులు, సీనియర్ నేతలు, యువ నాయకులు, మహిళా నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాత్రింబవళ్లు శ్రమించిన ప్రతి కార్యకర్త కృషి మరువలేనిదని, ఈ విజయాన్ని అందించిన ఓటర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ సాధిస్తున్న విజయాల్లో గుడిపల్లి మండలంలోని ఈ 13 స్థానాల విజయం ప్రత్యేకమని పేర్కొన్నారు. విజయం సాధించిన 13 మంది ఎంపీటీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలను తెలుగుదేశం పార్టీకి అందించిన ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విజయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ అంకితం చేస్తున్నట్లు మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
సూర్య రిపోర్టర్: లెనిన్ బాబు గుడిపల్లి మండలం.