గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 4.52 కోట్లు కేటాయింపు: ఎమ్మెల్యే
చీపురుపల్లి మేజర్ న్యూస్:
నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4.52 కోట్లు కేటాయించిందని శాసన సభ్యులు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. మండలంలోని పత్తికాయవలస – మొగదిపేట రోడ్డుకి రూ. 105 లక్షలు, సంకుపాలెం – చీపురుపల్లి - లావేరు రోడ్డుకి రూ.145 లక్షలు,
పెదనడిపల్లి రోడ్డు కోసం రూ.202లక్షలు, కేటాయింపులు జరిగాయని తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతులు, రహదారుల అనుసంధానానికి పెద్దపీట వేస్తూ రూ. 4.52 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక రహదారి అభివృద్ధి పనులకు శనివారం ఘనంగా శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక వికాసానికి బాటలు వేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రజల తపున ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.