గ్రామ స్వరాజ్యానికి స్థానిక సంస్థలే కీలకం
ఆమదాలవలస, సూర్య : ప్రజాస్వామ్యానికి పునాదులైన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మాజీ స్పీకర్, శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ వైసిపి ఇన్చార్జ్ తమ్మినేని సీతారాం తన సతీమణి తొగరాం మాజీ సర్పంచ్ తమ్మినేని వాణిశ్రీతో కలిసి గురువారం తమ స్వగ్రామమైన ఆమదాలవలస మండలం తొగరాంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇద్దరూ తమ ఓటును నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు స్థానిక సంస్థలే కీలకమైన పునాదులని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ స్వరాజ్య లక్ష్యం సాకారమవుతుందని అన్నారు. స్థానిక సంస్థలు బలోపేతమైనప్పుడే గ్రామాల అభివృద్ధికి సరైన దిశ, ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు కేవలం ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదని, గ్రామాల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు విలువైనదని, ఓటు ద్వారా ప్రజలు తమ ఆకాంక్షలను ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు.