గంగలకుర్రు నిమజ్జన ఘర్షణల్లో అక్రమ కేసులు.. బాధితులకు న్యాయం చేయాలి :వైఎస్ జగన్‌కు వినతి
సూర్య అంబాజీపేట మేజర్ న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. గంగలకుర్రులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక వర్గానికి చెందిన వారిపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలించారని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి, గంగలకుర్రు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనకు స్వయంగా వివరించారు. స్థానిక పరిస్థితులు, పోలీసుల వ్యవహారశైలిపై పార్టీ అధినేతకు సమగ్ర నివేదికను అందజేశారు. రాజకీయ ఒత్తిళ్లతో నిర్దోషులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, అన్యాయంగా జైలుకు వెళ్లిన బాధిత కుటుంబాలకు పార్టీ అండగా నిలవాలని, వారికి తగిన న్యాయం జరిగేలా న్యాయపోరాటం చేయాలని కోరారు.
దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీలో పి.గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు వెంట వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులు పి.కె.రావు, అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.