గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలు ఆచరణీయం: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
-నంద్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
-గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల అర్బన్:
జాతిపిత మహాత్మా గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం అందించిన సేవలు, చూపిన సత్యం, శాంతి, అహింసా మార్గాలు నేటికీ సదా ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గల గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచి దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యాల పరిరక్షణకు యువత బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పరిశుభ్రత, సమానత్వం వంటి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ఆర్డీవో విశ్వనాధ్ , మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్మార్వో శ్రీనివాసులు, ఎంఈ నాగభూషణం రెడ్డి, అడ్వకేట్ రామచంద్రరావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, మాజీ కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్ లాల్ , కృపాకర్, పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్, కామిని మల్లికార్జున, తాటికొండ బుగ్గ రాముడు, జాకీర్, బోయ రామకృష్ణ, మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, పసుపులేటి నారాయణ, అక్బర్, విజయ గౌరీ, పద్మ, నాజీరా మరియు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.