ఎయిర్‌పోర్టు ఉద్యోగాలంటూ టోకరా!
* జిఎంఆర్ పేరుతో నకిలీ పోస్టర్లు.. డబ్బులు డిమాండ్
* భోగాపురం సీఐ దుర్గాప్రసాద్ హెచ్చరిక
భోగాపురం, సెప్టెంబర్ 30,(మేజర్ న్యూస్)
ఎయిర్‌పోర్టులో ఉద్యోగం.. మంచి జీతం.. వెంటనే నియామకం అంటూ నిరుద్యోగ యువతను ఆకర్షించి డబ్బులు దండుకునే ముఠాలు రంగంలోకి దిగాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, జిఎంఆర్ గ్రూప్ పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ ఉద్యోగ ప్రకటనలతో అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భోగాపురం సీఐ దుర్గాప్రసాద్ బుధవారం హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో వాట్సాప్ ద్వారా సంప్రదిస్తూ, ఎంపిక ప్రక్రియలో భాగంగా వివిధ రకాల ఛార్జీల పేరుతో డబ్బులు చెల్లించాలని కొందరు వ్యక్తులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా 8498818161 నంబర్ నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలు, పోస్టర్ల విషయంలో నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
* డబ్బులు అడిగితే మోసమే
జీఎంఆర్ గ్రూప్ లేదా గుర్తింపు పొందిన విమానాశ్రయ సంస్థలు ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేయవని సీఐ స్పష్టం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ తదితర పేర్లతో ఎవరైనా నగదు అడిగితే చెల్లించవద్దని సూచించారు. ఇలాంటి ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని అపరిచితులకు ఇవ్వకూడదన్నారు.
* మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు
ఇప్పటికే ఎవరైనా ఈ తరహా మోసానికి గురై డబ్బులు చెల్లించి ఉంటే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సీఐ దుర్గాప్రసాద్ సూచించారు. అలాగే cibercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయాలని తెలిపారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వాట్సాప్ సందేశాలు, పోస్టర్లు, ఫోన్ నంబర్లు, చెల్లింపులకు సంబంధించిన రసీదులు వంటి ఆధారాలను భద్రపరచాలని సూచించారు. యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఉద్యోగ ప్రకటనలను ఇతరులతో పంచుకుని మరింత మందిని మోసానికి గురికాకుండా కాపాడాలని సీఐ దుర్గాప్రసాద్ కోరారు.