ఎరువుల విక్రయం పై డీలర్లు సిబ్బందికి శిక్షణ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో శుక్రవారం డివిజన్ స్థాయిలో రైతులకు నూతన ఎరువుల విక్రయ విధానం గురించి ఎరువుల డీలర్లు రైతు సేవా కేంద్ర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్పేట మండలాలకు చెందిన ఎరువుల డీలర్లు, ఆర్ఎస్ కే సిబ్బంది పాల్గొనగా అనంతసాగరం మండల వ్యవసాయ అధికారిణి,ఆత్మకూరు ఇన్చార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.శైలజా కుమారి శిక్షణను ఇచ్చారు. ఎఫ్ ఎఫ్ ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్స్ సేల్) అనే యాప్ ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఈ యాప్ ద్వారానే డీలర్లు ఎరువులను విక్రయించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగం గురించి ఆమె అవగాహన కల్పించారు. ఈ అంశాన్ని రైతులందరికీ అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ యాప్ ద్వారానే రైతులు తమకు అవసరమైన ఎరువులను నమోదు చేసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఈ యాప్ లో నమోదు గురించి పూర్తిగా వివరించి అవగాహన కల్పించాలని ఆమె రైతు సేవా కేంద్ర సిబ్బందికి సూచించారు. డీలర్లు కూడా రైతులకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ సి ఏ డి ఏ పి.దేవసేనమ్మ, స్థానిక ఏ డి ఏ కార్యాలయ టెక్నికల్ వ్యవసాయ అధికారిణి పి. చంద్రభాను, ఆత్మకూరు, ఏ ఎస్ పేట వ్యవసాయ అధికారులు కే. కిషోర్ బాబు, ఎం. సురేష్ బాబు, హెచ్ ఓ సి హెచ్. రాజశేఖర్, మూడు మండలాల ఎరువుల డీలర్లు, ఆర్ఎస్కే సిబ్బంది, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.