ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పేదలకు భరోసా
-ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, అక్టోబర్ 1, మేజర్ న్యూస్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో అర్హులైన పేదలకు భరోసా కలుగుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ 8,18 వార్డుల్లో గురువారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం పెన్షన్లను పెంపుదల చేసి, ఉదయాన్నే గడప వద్దకు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులెవరూ ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వార్డుల్లో ఉన్న సమస్యలను ప్రజలతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత, పిఎసిఎస్ అధ్యక్షురాలు సిమ్మ మాధవి, రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ రవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.