ఎన్నికల్లో అల్లరి చేస్తే జైలే!
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహణే లక్ష్యం.
- ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరిక
నగదు, మద్యం పంచితే అభ్యర్థిత్వం రద్దు. నాన్ బెయిలబుల్ కేసులు.
ఫేక్ న్యూస్ కు గ్రూప్ అడ్మిన్ కూడా అరెస్ట్
అనకాపల్లి,జిల్లాలో త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను నూరు శాతం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసు శాఖ ధ్యేయమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, సబ్ డివిజన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ ప్రాంతాల చరిత్ర ఆధారంగా పటిష్ట భద్రత. సమస్యాత్మక వ్యక్తులు, పాత నేరస్థులపై వెంటనే బైండోవర్ చర్యలు. పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్లను త్వరితగతిన అమలు. లైసెన్స్డ్ ఆయుధాలను వెంటనే స్టేషన్లలో డిపాజిట్. ఫ్లెక్సీలు, విగ్రహాల తొలగింపు, పహారా పెంపు.అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ - ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:
ఒకే సమయంలో, ఒకే మార్గంలో వేర్వేరు పార్టీల ర్యాలీలకు అనుమతి లేదు. ఘర్షణకు దిగితే అల్లర్లు, విధులకు ఆటంకం కింద తక్షణ అరెస్ట్. సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు 48 గంటల ముందే అనుమతి తప్పనిసరి. ప్రచార వాహనాలకు పాస్ కావాలి. లేకుంటే ఎన్నికలు ముగిసే వరకు వాహనాలు సీజ్. ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైకులు. ఆసుపత్రులు, స్కూళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద సైలెంట్ జోన్ - ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్స్ సీజ్. ఓటర్లకు మద్యం, నగదు, బహుమతులు పంచితే అభ్యర్థిత్వం రద్దు (అనర్హత వేటు). అక్రమ రవాణాదారులపై నాన్-బెయిలబుల్ కేసులు. సరైన పత్రాలు లేకుండా రూ.50 వేలకు పైగా నగదు, విలువైన వస్తువుల రవాణా చేస్తే సీజ్. కుల, మత విద్వేషాలు, వ్యక్తిగత దూషణలు, ఫేక్ న్యూస్, మార్ఫింగ్ ఫోటోలు పెడితే ఐటీ, సైబర్ క్రైమ్ కింద పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్లపై కూడా కేసులు, అరెస్ట్. ఫ్లెక్సీలు చించడం, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులపై అనుమతి లేకుండా ప్రచార సామగ్రి పెడితే పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ యాక్ట్ కింద కేసు, ఖర్చు అభ్యర్థి ఖాతాలో. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ "స్థానిక ఎన్నికలు గ్రామాలు, పట్టణాల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం. గెలవాలనే కసితో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జీవితాంతం మాయని మచ్చలా క్రిమినల్ కేసులు నమోదవుతాయి. ఓటర్లు భయాలు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలి" అని పిలుపునిచ్చారు. ఫిర్యాదుల కోసం పోలీస్ ఎమర్జెన్సీ 100 / 112 లేదా సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలియజేశారు.