ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేయాలి
పార్వతీపురం, నవంబరు 25: మేజర్ న్యూస్ : జిల్లాలో ఈ నెల 26వ తేదీ గురువారం తొలి విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బంది రవాణా గూర్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తయినట్లు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలను చేరుకున్నట్లు అధికారులు తెలియజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులందరూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఒకేసారి ఇద్దరి కంటే ఎక్కువ మంది ఓటర్లను లోపలికి అనుమతించరాదని, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. సిబ్బంది నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, ఎన్నికల కమిషను అందజేసిన నిబంధలను ఖచ్చితంగా అమలుచేస్తూ ఎన్నికలను పూర్తిచేయాలని తెలిపారు. 26వతేదిన మద్యాహ్నం1 గంటకు పోలింగు , సాయంత్రం 5 గంటలకు కౌంటింగు పూర్తిచేయాలని, షెడ్యూలు ప్రకారం ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. సిబ్బంది విధులకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను మార్చిన చోట్ల అందుకు గల కారణాలతో సమగ్ర నివేదిక అందించాలని, విధులకు హాజరుకాని సిబ్బందికి షోకాజు నోటీసులు జారీచేయాలని తెలిపారు. పోలింగ్ విధులు నిర్వహణ అనంతరం సిబ్బంది వారి స్వస్థలాలకు తిరిగివెళ్లుటకు వీలైన సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు సచిన్ అర్చిత రహార్, పవార్ స్వప్నిల్ జగన్నాధ్, డీఆర్వో కె.హేమలత, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.