ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల పరిశీలన
నామినేషన్ కేంద్రంలో సౌకర్యాలు, భద్రతపై ఆరా
మెళియాపుట్టి: నవంబర్ 17. మేజర్ న్యూస్... స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మెళియాపుట్టి మండలం కోసమాల గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని బుధవారం ఆర్డీవో కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు, ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్ పండా, ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ పరిశీలించారు.
నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ పోలీసు సిబ్బందికి సూచించారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆర్డీవో సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.