ఎన్నికల భద్రతలో నిర్లక్ష్యం తగదు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం :ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.స్ట్రాంగ్ రూములు,కౌంటింగ్ హాళ్ల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాలెట్ బాక్సులు,ఎన్నికల సామగ్రి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.ఆదివారం కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని విశ్వకవి వేమన డిగ్రీ కళాశాల,ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కొత్తపేట,అంబాజీపేట, అయినవిల్లి,పి.గన్నవరం, రావులపాలెం మండలాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములు,కౌంటింగ్ హాళ్లు,భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కౌంటింగ్ టేబుళ్ల అమరిక,ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.ఎన్నికల ప్రక్రియలో వినియోగించే బ్యాలెట్ బాక్సులు,ఇతర సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు,నియమ నిబంధనలను ప్రతి అధికారి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.స్ట్రాంగ్ రూములు,కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.ఈ పర్యటనలో కొత్తపేట ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ,రోడ్లు మరియు భవనాల శాఖ అధికారి బి.రాము,కొత్తపేట తహసీల్దార్ వై.రాంబాబు, డీఎల్‌డీవోలు,ఎంపీడీవోలు,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.